బొమ్మ హెలికాప్టర్ ఎగరడంలేదు సార్... దుకాణదారుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు

 
సంగారెడ్డి జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాను కొనుగోలు చేసిన బొమ్మ హెలికాప్టర్ పనిచేయడం లేదని, షాపు యజమాని తనను మోసం చేశాడని ఆరోపిస్తూ పదేళ్ల బాలుడు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ సంఘటన కంగ్టి మండల కేంద్రంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. కంగ్టి మండల కేంద్రానికి చెందిన పదేళ్ల వినయ్ రెడ్డి, తన అమ్మమ్మ ఊరిలో జరుగుతున్న జాతరకు తాతయ్యతో కలిసి వెళ్లాడు. జాతరలోని ఓ దుకాణంలో రూ. 300 పెట్టి ఓ బొమ్మ హెలికాప్టర్‌ను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి తీసుకెళ్లి ఆడితే అది ఎగరలేదు. దీంతో నిరాశ చెందిన బాలుడు, మరుసటి రోజు జాతరకు వెళ్లి ఆ బొమ్మను దుకాణదారుడికి ఇచ్చివేసి, మరో హెలికాప్టర్‌ను తీసుకున్నాడు.

తీరా చూస్తే రెండోసారి తెచ్చిన బొమ్మ కూడా పనిచేయలేదు. దీంతో బాలుడు మూడోసారి కూడా దుకాణానికి వెళ్లి బొమ్మను మార్చుకున్నాడు. దురదృష్టవశాత్తు, మూడో హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో వినయ్ రెడ్డి విసుగెత్తిపోయాడు. బొమ్మను తిరిగి ఇచ్చేసి, తన డబ్బులు వాపస్ ఇవ్వాలని షాపు యజమానిని కోరాడు. అయితే, అందుకు దుకాణదారుడు నిరాకరించడమే కాకుండా బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాను పెట్టిన డబ్బులు వృధా అయ్యాయని, షాపు యజమాని తనను మోసం చేశాడని భావించిన ఆ బాలుడు నేరుగా కంగ్టి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. జరిగిన విషయాన్ని అక్కడి ఎస్ఐకి వివరించి, బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని, డబ్బులు తిరిగి ఇవ్వకుండా యజమాని తనను తిట్టాడని ఫిర్యాదు చేశాడు. పదేళ్ల పిల్లాడు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే స్పందించారు.

ఎస్ఐ ఆదేశాల మేరకు ఓ కానిస్టేబుల్ జాతర వద్దకు వెళ్లి విచారణ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసు అక్కడికి చేరుకునే సమయానికే ఆ బొమ్మల దుకాణం యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బాలుడి తాతను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. అనంతరం వినయ్ రెడ్డికి నచ్చజెప్పి, ఇంటికి పంపించారు.

Vinay Reddy
Toy Helicopter
Police Complaint
Sangaredi District
Kangadi Mandal
Child Consumer Rights
Faulty Toy
Shop Owner
Refund
Telangana

More Telugu News